జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ అస్తవ్యస్తంగా తయారైందని, ప్రభుత్వం తక్షణమే స్పందించి కొనుగోళ్లు చేపట్టాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి డిమాండ్ చేశారు.
ఈ మేరకు ఆయన సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రికి ఒక బహిరంగ లేఖ రాశారు. జిల్లాలో ధాన్యం సేకరణ నత్తనడకన సాగుతుండటంతో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
జిల్లాలో ప్రస్తుతం పగటి ఉష్ణోగ్రతలు 42 నుంచి 43 డిగ్రీలకు చేరుకున్నాయని, ఈ తీవ్రమైన ఎండల కారణంగా ధాన్యంలో తేమ ఆరిపోయి తూకంలో రైతులు భారీగా నష్టపోతున్నారని లేఖలో పేర్కొన్నారు. 40 కిలోలు తూగాల్సిన సన్న ధాన్యం బస్తా, ఎండల వల్ల కేవలం 35-36 కిలోలకే వస్తోందని తెలిపారు.
ఎండల తీవ్రతకు ధాన్యం ఎండిపోయి, మిల్లులో నూకలయ్యే ముప్పు పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లాలో సుమారు 8 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉండగా, ఇప్పటి వరకు కేవలం 2 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే సేకరించారని దినేష్ పటేల్ విమర్శించారు.
మిగిలిన 6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రోడ్ల మీద, కల్లాల్లోనే ఎండకు ఎండుతోందని మండిపడ్డారు. తేమ సమస్య లేకపోయినా కొనుగోలు కేంద్రాలు, రైస్ మిల్లుల వద్ద రైతులు పడిగాపులు కాయాల్సి వస్తోంది. దొడ్డు వడ్లకు మిల్లుల అలాట్‌మెంట్ చేయకపోవడం, చివరి నిమిషంలో కంప్యూటర్ ట్యాగింగ్ చేపట్టడం అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ట.”
అని ఆయన ధ్వజమెత్తారు. రాష్ట్రవ్యాప్తంగా 7,000 కేంద్రాలు తెరిచామని ప్రభుత్వం చెబుతున్నా, క్షేత్రస్థాయిలో కేవలం 2,800 కేంద్రాలే పనిచేస్తున్నాయని దినేష్ పటేల్ ఎద్దేవా చేశారు. అధికారుల మధ్య సమన్వయ లోపం వల్ల హమాలీలు ఉంటే తూకం ఉండదని, తూకం ఉంటే ట్యాగింగ్ ఉండదని, అన్నీ ఉన్నా రవాణాకు లారీలు రావడం లేదని విమర్శించారు.
మిల్లుల వద్ద లారీలు రోజుల తరబడి వేచి ఉన్నా మిల్లర్లు ధాన్యం దించుకోవడం లేదని, ప్రజాప్రతినిధులు మిల్లర్లను బతిమిలాడాల్సిన దయనీయ స్థితి నెలకొందని పేర్కొన్నారు.
తక్షణమే ప్రభుత్వం స్పందించి, రైస్ మిల్లర్లతో ఉన్న సమస్యలను పరిష్కరించి, రైతుల వద్ద ఉన్న ప్రతి గింజను కొనుగోలు చేసి ఆదుకోవాలని బీజేపీ పక్షాన ఆయన డిమాండ్ చేశారు.
