రాష్త్రం ప్రభుత్వం విషయంలో మార్చి 17 వరకు ఓపిక పడతామని.. ఆ తర్వాత ఆరు గ్యారెంటీలు అమలు చేయకుంటే ప్రజా బాట పడతామని కేటీఆర్ చెప్పారు. కాంగ్రెస్ సర్కార్‌కు డెడ్ లైన్ విధించారు. ఆదివారం కామారెడ్డిలో బీఆర్ఎస్ కార్యకర్తలతో కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ను గెలిపించి కేసీఆర్ నేతృత్వంలోని మంచి ప్రభుత్వాన్ని ఓడించి తప్పు చేశామని ప్రజలు అంటున్నారని అన్నారు. .కామారెడ్డిలో బీఆర్ఎస్ ఓటమి తీవ్ర నిరాశ మిగల్చిందని, అసంబద్ధమైన హామీలిచ్చి కామారెడ్డిలో కేసీఆర్‌ను ఓడించారన్నారు.
గొర్రె కసాయిని నమ్మినట్లు ప్రజలు రేవంత్ రెడ్డికి అధికారం ఇచ్చారని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి నిజాయితీ గల మోసగాడని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్న రేవంత్ రెడ్డికి దమ్ముంటే ఇచ్చిన హామీలను అమలు చేయాలని సవాల్ విసిరారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే డిసెంబర్ 9వ తేదీన రూ. 2లక్షల రుణమాఫీ చేస్తామన్నారు.. అధికారంలోకి వచ్చి దాదాపు మూడు నెలల అయ్యింది.. మరీ రుణమాఫీ ఏమైందని ప్రశ్నించారు.
