అధికారి అలసత్వం ..దేశభక్తి అపహస్యం – కమ్మర్పల్లి ఇరిగేషన్ కార్యాలయంలో ఆవిష్కరించని మువ్వెన్నెల జెండా – జెండాను సిద్ధపరచి మూలన పెట్టిన నీటిపారుదల శాఖ అధికారులు – ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సామాన్యులు – ఉన్నతాధికారులు చర్యలు చేపట్టాలని డిమాండ్
దేశమంతా నిన్న పంద్రాగస్టు వేడుకల్లో తమ దేశభక్తిని చాటుకుంటే కమ్మర్పల్లి సాగునీటి శాఖ అధికారులు మాత్రం అదృశ్యమయ్యారు. సామాన్యులకు ఆదర్శంగా నిలవాల్సిన ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్య వైఖరితో మువ్వన్నెల జెండా మూగబోయింది.
కమ్మర్పల్లి ఇరిగేషన్ కార్యాలయంలో ఎఈ శేఖర్ తోపాటు జూనియర్ అసిస్టెంట్, అటెండర్, స్వీపర్ లు ఉన్నారు.
స్వాతంత్ర వేడుకల కోసం జెండాను ఆవిష్కరించేందుకు అన్ని సిద్ధం చేసినప్పటికిని సదరు అధికారులు ఎవరు కార్యాలయం వైపు కన్నెత్తి చూడకపోవడంతో సిద్ధం చేసిన మువ్వన్నెల జెండాను మూలన పెట్టేసి స్వీపర్ అక్కడి నుండి ఇంటికి తిరిగి వెళ్లారు.
కమ్మర్ పల్లి మండల కేంద్రంలో సాగునీటి శాఖ కార్యాలయానికి సొంత భవనం లేకపోవడంతో ప్రస్తుతం మహిళా సమాఖ్య భవనంలో ఆఫీసు కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు.
జెండా ఆవిష్కరణ కోసం కార్యాలయం బయట సిద్ధం చేసిన మహాత్మా గాంధీ అంబేద్కర్ చిత్రపటాలను ఆఫీసులో తిరిగి పెట్టేసి తాళం వేసి వెళ్లారు.
ఏ ఈ శేఖర్ ప్రస్తుతం మండలంలోని కోనాపూర్ గ్రామ ప్రత్యేక అధికారిగా ఉన్నారు. అయితే అక్కడ కూడా తాను ఈ వేడుకలకు దూరంగా ఉన్నట్టు సమాచారం.
ఇప్పటికైనా స్వతంత్ర భారతంలో ఎందరో త్యాగదనుల రక్తంతో సంపాదించిన స్వేచ్ఛను తప్పు దోవ పట్టించిన అధికారులపై ఉన్నతాధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే….!