కార్యకర్తలకు దూరంగా ఉంటున్న జిల్లా నేతలు
కాంగ్రెస్ వైపు దృష్టిసరిస్తున్న ద్వితీయశ్రేణి నేతలు
బి ఆర్ ఎస్ లో నెలకొన్న నైరాశ్యం
ఓడలు బండ్లవుతాయి… బండ్లు ఓడలవుతాయి అన్న సామెత ఇందూరు రాజకీయాలకు నిలువుటద్దంగా కనబడుతుంది.గత ఆరు నెలల్లో జరిగిన అసెంబ్లీ , పార్లమెంటు ఎన్నికల ఫలితాలతో జిల్లాలో రాజకీయ పరిస్థితులు తారుమారయ్యాయి. అసెంబ్లీ,, లోక్ సభ ఎన్నికల్లో ఓటమి రుచి చూసిన టిఆర్ఎస్ చతికిల పడిపోయింది.
తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత తిరుగులేని పార్టీగా జెట్ స్పీడ్ తో దూసుకు వెళ్లిన కారు ఒక్కసారి ఫంక్షర్ అయింది. నిజామాబాద్ అర్బన్, రూరల్, బోధన్, ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గలలో రెండు పర్యాయాలు మొత్తానికి మొత్తం ఎమ్మెల్యేలు ఎన్నిక కాగా,2014 ఎన్నికల్లో పార్లమెంటు స్థానానికి ఎంపీగా కెసిఆర్ కూతురు కల్వకుంట్ల కవిత ఎన్నికయ్యారు.
అటు తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుని కవితకు జిల్లా రైతులంతా ఓటమి రుచి చూపించారు. కవిత ఓటమితో ప్రారంభమైన పరాజయపు పరంపర బి ఆర్ ఎస్ పార్టీ శ్రేణుల్లో గొప్ప నైరాశ్యన్ని మిగిల్చాయి. గత పార్లమెంటు ఎన్నికల్లో బిజెపి అభ్యర్థిగా గెలుపొందిన అరవింద్ ను వేటాడి ఓడిస్తానని శపధం చేసిన కవిత ఢిల్లీ లిక్కర్ కేసులో జైలుకు వెళ్లడంతో పార్టీ పగ్గాలు పూర్తిగా మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డికి వ్యతిరేక పవనాలతో భారంగా మారాయి.
ఓ దశలో ప్రశాంత్ రెడ్డి జిల్లాకు మంత్రిగా ప్రాతినిథ్యం వహిస్తున్నప్పటికిని బాల్కొండ నియోజకవర్గానికి పరిమితం కావడం ఆ పార్టీకి తీరని నష్టాన్ని మిగిల్చాయి దీంతో పార్టీ నేతల్లో అయోమయం నెలకొనడంతో పాటు… మొన్న జరిగిన పార్లమెంటు ఎన్నికలలో ఘోర పరాజయంతో బిఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో ఆత్మస్థైర్యం దెబ్బతిన్నట్టు కనిపిస్తోంది.
పార్టీ నాయకులు నుండి భరోసా కరువై కార్యకర్తలు తీవ్ర నిరాశలో ఉన్నట్టు తెలుస్తోంది. జిల్లాలో గులాబీ నేతలు ఒక్కసారిగా సైలెంట్ కావడంతో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితుల్లో బి.ఆర్ ఎస్ కార్యకర్తలు కనబడుతున్నారు.
దీంతో గ్రామస్థాయిలో ఉన్న ద్వితీయ శ్రేణి నాయకులు రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని అధికార కాంగ్రెస్ వైపు చూస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికైనా బిఆర్ఎస్ నాయకత్వం దృష్టిసారించకపోతే పార్టీ ఉనికికే ప్రమాదం కలగవచ్చు అని పలువురు అభిప్రాయపడుతున్నారు.