ప్రజాస్వామ్యంలో జర్నలిస్టుల పాత్ర కీలకమని, దీన్ని ప్రతి ఒక్క జర్నలిస్ట్ గుర్తించాలని ప్రెస్ అకాడమి చైర్మెన్ శ్రీనివాస్ రెడ్డి, ప్రముఖ ప్రజా కవి, రచయిత నందిని సిదా రెడ్డి పేర్కొన్నారు. గురువారం జిల్లా కేంద్రం లోని ఒక ఫంక్షన్ హాల్ లో టీయుడబ్ల్యుజే (ఐజేయు) ఆద్వర్యంలో ప్రజాస్వామ్యం – మీడియా అనే అంశంపై సదస్సును నిర్వహించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జర్నలిస్టుల్లో పోరాట శీలత తగ్గడం వల్లే జర్నలిజానికి ఇబ్బందులు తలెత్తుతున్నాయని, పత్రికా స్వేచ్చలో ప్రపంచంలోనే భారతదేశం 159వ స్థానంలో ఉందన్నారు.
జర్నలిస్టులకు సమాజంలో గౌరవం తగ్గిందనేది సత్యమని, సమాచార హక్కు ప్రజలకున్నా, ఈ రోజుల్లో ఆ హక్కును పాలకులు పట్టించుకునే పరిస్థితి లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సత్యాన్ని రాసిన జర్నలిస్టు షోయబుల్ల ఖాన్ హత్యకు గురయ్యాడని అన్నారు. ప్రధాన పత్రికలు, పార్టీలకు మద్దతు తెలిపే యాజమాన్యాల చేతుల్లో ఉండడం వల్ల ప్రజాసమస్యలు బయటకురాని పరిస్థితి నెలకుందన్నారు.
అందుకే సోషల్ మీడియా ఈ రోజు సక్సెస్ ఫుల్ గా ముందుకు సాగుతుందన్నారు. ప్రశ్నించే బలమైన గొంతు అయిన జర్నలిజాన్ని కాపాడుకోవాల్సిన అవసరము ఎంతైన ఉందన్నారు. సమాచారం చేరవేయడంలో ఉండాల్సిన పారదర్శకత ఇప్పుడు లేదని, జర్నలిస్టులు హంసల పాత్ర వహించి పాలను, నీరును వేరు చేసినట్లు నిష్కపక్షపాతంగా సమాచారం ప్రజలకు చేరవేయాలని అన్నారు.
బాధ్యతతో పనిచేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, విలువల కోసం ధీరోదాత్తతతో పోరాడాలని అన్నారు. జర్నలిస్టులను గౌరవించాల్సింది అధికారులు, నేతలు కాదని, ప్రజలే ప్రజాస్వామ్య మనుగడలో జర్నలిస్టులది కీలకపాత్ర పోషించాలని అన్నారు. వార్తకు తటస్థం లేదని, తటస్థముంటే అది ప్యాకేజీ వార్తనే అవుతుందని అన్నారు.
ప్రజాస్వామ్యంలో ప్రజల తరపున పని చేస్తున్న మీడియాకు కూడా పారదర్శకత అవసరమేనని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలను కునేవారందరూ ఫిఫ్థ్ ఫిల్లర్ గా ఏర్పడి కలిసి పనిచేయాలని, వృత్తి ప్రమాణాలు కాపాడుకోవడానికి జర్నలిస్టులు ఐక్యంగా ముందుకు సాగాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో బోధన్ ఎమ్మెల్యే సుదర్శ్ రెడ్డి, అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ, రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ఉర్దు అకాడమి చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, రాష్ట్ర టియుడబ్ల్యుజే అధ్యక్శులు నగునూరి శేఖర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విరాహత్ అలీ, టియుడబ్ల్యుజే (ఐజేయు) జిల్లా అధ్యక్షుడు ఎడ్ల సంజీవ్, జిల్లా కార్యదర్శి అరవింద్ బాలజీ, జిల్లా కోశాధికారి సిరిగాద ప్రసాద్, ఆర్గనైజింగ్ కార్యదర్శి జి.సంజీవ రెండ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అహ్మద్ అలీ ఖాన్, జాతీయ కౌన్సిల్ సభ్యులు చింతల గంగాదాస్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు బొబ్బిలి నర్సయ్య, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఎంఏ మాజీద్, అక్రిడిటేషన్ కమిటి సభ్యులు పాకల నర్సింలు, కొక్కు రవికుమార్ నిజామాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు అంతడకుల రమాకృష్ట, కార్యదర్శి బైర శేఖర్ లతో పాటు జిల్లా వ్యాప్తంగా ఉన్న టియుడబ్ల్యుజేయు సభ్యులు జర్నిలిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.