బ్రీత్ అనలైజర్ పరీక్షకు నిరాకరణ.. నడిరోడ్డుపై రచ్చరచ్చరైల్వేకమాన్ ఘటన.. మూడో టౌన్ ఠాణాలో కేసు నమోదు.. మందు బాబులు రెచ్చిపోయారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసులపైనే ప్రతాపం చూపించారు.
“మేం తాగితేనే మీకు జీతాలు వస్తున్నాయి” అంటూ ఓ తాగుబోతు ట్రాఫిక్ పోలీసులపై విరుచుకుపడటమే కాకుండా.. ఏకంగా సీఐ, ఎస్‌ఐలను నెట్టివేసిన ఘటన ఆదివారం రైల్వేకమాన్ కూడలిలో చోటుచేసుకుంది.పోలీసుల కథనం ప్రకారం..
ఆదివారం రాత్రి పోలీసులు రైల్వేకమాన్ వద్ద సాధారణ వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆర్మూర్ నుంచి నిజామాబాద్ వైపు కారులో వస్తున్న ఓ వ్యక్తిని ఆపి, డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షల్లో భాగంగా బ్రీత్ అనలైజర్ ఊదాలని కోరారు. దీంతో మందు మత్తులో ఉన్న సదరు వ్యక్తి ఒక్కసారిగా ఊగిపోయాడు. పరీక్షకు నిరాకరించడమే కాకుండా..
“మేము మందు తాగడం వల్లే ప్రభుత్వానికి ఆదాయం వస్తోంది.. అందుకే మీకు జీతాలు అందుతున్నాయి” అంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగాడు.పరిస్థితిని గమనించిన ట్రాఫిక్ సీఐ, ఎస్‌ఐ అతడిని సముదాయించే ప్రయత్నం చేయగా.. నిందితుడు మరింత రెచ్చిపోయి వారిపైనే దాడికి దిగాడు.
సీఐ, ఎస్‌ఐలను నెట్టివేస్తూ నడిరోడ్డుపై వీరంగం సృష్టించాడు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకున్నారు. పరీక్షలో అతడు మోతాదుకు మించి మద్యం సేవించినట్లు నిర్ధారణ అయ్యింది.
విధి నిర్వహణలో ఉన్న అధికారులపై దౌర్జన్యానికి పాల్పడిన నిందితుడిని మూడో టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ట్రాఫిక్ పోలీసుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
