రాత్రనక పగలనక ఆరుంగాలం కష్టపడి సాగుచేసిన రబీ సీజన్ వరి పంట కోత దశలో వడగళ్ల వర్షానికి తీవ్రంగా దెబ్బతింది. లక్షల రూపాయలు వెచ్చించి సాగు చేసిన వరి పంట కళ్లముందే పాడవుతుంటే రైతులు లబో దిబోమంటున్నారు.
నిజామాబాద్ జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం అకాలంగా కురియడంతో అన్నదాతకు అపార నష్టం వాటిల్లింది . సిరికోండ మండలంలోని పలు గ్రామాల్లో వడగండ్ల వాన కురియడంతో రైతుల జీవితాల్లో కడగండ్లు మిగిలాయి.
చేతికందిన వరి పంట నేలకోరిగింది.ఆరబెట్టిన ధాన్యం వర్షార్పణం కావడంతో అన్నదాతలు లబోదిబోమంటున్నారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని గోడు వెల్లబోసుకుంటున్నారు. జిల్లాలో ఆర్మూర్ డివిజన్ పరిధిలో ఆర్మూర్, బాల్కొండ, ముప్కాల్, వేల్పూర్, మోర్తాడ్, కమ్మర్పల్లి, భీంగల్ మండలాలలో అరగంటసేపు భారీ వర్షం కురిసిందిసిరికొండ మండలంలో శనివారం సాయంత్రం 15 నిమిషాలు ఏకధాటిగా కురిసిన అకాల వర్షానికి రైతులకు అపార నష్టం వాటిల్లింది.
మండలంలోని పెద్దవాల్గోట్, కొండూరు, చిన్నవాల్గోట్, న్యావనంది, రావుట్ల, పందిమడుగు, చిమన్ పల్లి, తాటిపల్లి, సిరికొండ, మైలారం, కుర్దుల్ పేట గ్రామాల్లో రాళ్ల వర్షం కురిసింది.అనేక చోట్ల రోడ్లపై ఆరబోసిన వరి ధాన్యం అకాల వర్షానికి నీటి పాలయ్యింది. కొందరి రైతుల వరి ధాన్యం వర్షపు నీటిలో కొట్టుకుపోయాయి.
శనివారం కురిసిన అకాల వర్షానికి పడ్డ కష్టంతో పాటు చేతికి వచ్చిన వరి పంట నష్టపోయి రైతులు దేవుడికి శాపనార్ధాలు పెడుతున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు జరిగిన పంట నష్టాన్ని అంచనా వేసే పనిలో ఉన్నారు.


