ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మాంగ్ కులస్తులు అక్రమంగా మాదిగ కుల ధ్రువీకరణ పత్రాలు పొందుతూ, అసలైన మాదిగలకు దక్కాల్సిన అవకాశాలను కొల్లగొడుతున్నారని టీఎంఆర్పీఎస్ జిల్లా కమిటీ ఆరోపించింది. ఈ మేరకు సోమవారం జిల్లా సంయుక్త కలెక్టర్ (జేసీ)కి సంఘం నాయకులు వినతి పత్రం అందజేశారు..
ఈ సందర్భంగా టీఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు మల్లని శివ మాదిగ మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ ప్రకారం గ్రూప్-1లో ఉన్న మాంగ్ కులస్తులు (క్రమ సంఖ్య 42), గ్రూప్-2లో ఉన్న మాదిగల (క్రమ సంఖ్య 31) కుల పత్రాలను పొందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
మాంగ్ కులస్తుల మాతృభాష మరాఠీ అని, వారి సంస్కృతి సంప్రదాయాలు మాదిగలకు భిన్నంగా ఉంటాయని పేర్కొన్నారు. అధికారులు సరైన విచారణ చేయకుండా పత్రాలు జారీ చేయడం వల్ల విద్యా, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో మాదిగలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ధ్వజమెత్తారు.
“కొంతమంది నాయకులు మాంగ్, మాదిగలు ఒకటేనని తప్పుడు ప్రచారం చేస్తూ అధికారులను తప్పుదోవ పట్టిస్తున్నారు. దీనివల్ల మాంగ్ కులస్తులు అటు గ్రూప్-1 ప్రయోజనాలతో పాటు, ఇటు గ్రూప్-2లో ఉన్న మాదిగల ప్రయోజనాలను కూడా పొందుతున్నారు” అని శివ మాదిగ విమర్శించారు. నిజాం కాలం నుంచే ఈ రెండు కులాలు వేర్వేరు జాబితాల్లో ఉన్నాయని గుర్తు చేశారు.
జీవో నెంబర్ 58 ప్రకారం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో తక్షణమే విచారణ కమిటీ ఏర్పాటు చేయాలని టీఎంఆర్పీఎస్ డిమాండ్ చేసింది. గతంలో అక్రమంగా పొందిన మాదిగ కుల ధ్రువీకరణ పత్రాలను రద్దు చేయాలి. వారికి వెంటనే ‘మాంగ్’ కుల పత్రాలను జారీ చేయాలి.
తప్పుడు పత్రాలు పొందిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఈ కార్యక్రమంలో టీఎంఆర్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మారం అవిన్, తెలంగాణ మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర నాయకులు దుర్గయ్య మాదిగ, రమేష్ మాదిగ, ప్రకాష్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.
