——————————————————–జాన రమేష్:ఇది సంగతి; ఆర్మూర్: ఆర్మూర్ జర్నలిస్ట్ కాలనీలో అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం రెండు గంటలు అనే నినాదంతో నిర్వహిస్తున్న స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ కార్యక్రమం 39వ వారానికి చేరింది. ఈ ఆదివారం కాలనీ అభివృద్ధి కమిటీ ప్రతినిధులు, కాలనీవాసులు ఉత్సాహంగా శ్రమదానం నిర్వహించారు. క్లాక్ టవర్ నుంచి కాలనీ మరో చివరి వరకు ప్రధాన రోడ్డుపై అడ్డదిడ్డంగా పెరిగి రాకపోకలకు ఇబ్బందిగా పరిణమించిన చెట్ల కొమ్మలను తొలగించారు.
కట్టర్ సాయంతో కిందివైపుకు వంగి వాహనాలకు ఆటంకం కలిగిస్తున్నకొమ్మలను నరికి కుప్పగా వేశారు. రోడ్డుపై ఉన్న చెత్తాచెదారాన్ని తొలగించారు. పరిసరాలను పరిశుభ్రం చేశారు. ఈ సందర్బంగా కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు గోసికొండ అశోక్ మాట్లాడుతూ హోలీ పండుగ ఉన్నప్పటికీ స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ కార్యక్రమాన్ని నిర్వహించడం తమ చిత్తశుద్ధికి నిదర్శనమని పేర్కొన్నారు.
39 వారాలుగా ఏకధాటిగా ఈ కార్యక్రమం నిర్వహిస్తూనే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కాలనీవాసులను చైతన్యపరుస్తున్నామని తెలిపారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, కాలనీవాసుల సహకారంతో జర్నలిస్టు కాలనీని ఆదర్శ కాలనీగా తీర్చిదిద్దుతామని, రాష్ట్ర, కేంద్రస్థాయిలో గుర్తింపు తీసుకొస్తామని పేర్కొన్నారు. కాలనీలో డ్రైనేజీలు, కల్వర్టులు నిర్మింపజేయాలని ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక కౌన్సిలర్ వనం శేఖర్ ను కోరారు. ప్రస్తుతం కాలనీలో డ్రైనేజీ నిర్మిస్తున్నామని, ప్రభుత్వ, పురపాలక నిధులు మంజూరు చేయించి ఇతర మౌలిక వసతులు కల్పిస్తామని కౌన్సిలర్ వనం శేఖర్ హామీ ఇచ్చారు.
రోటరీ మాజీ అధ్యక్షుడు డీజే దయానంద్ మాట్లాడుతూ కాలనీ అధ్యక్షుడు అశోక్ ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం స్వచ్ఛ కాలనీ కార్యక్రమం నిర్వహించడం గొప్ప విషయమని పేర్కొన్నారు. కాలనీ అధ్యక్షుడు గోసికొండ అశోక్, ప్రధాన కార్యదర్శి బి.కమలాకర్, ఉపాధ్యక్షుడు సుంకే శ్రీనివాస్, కార్యదర్శులు కొంతం రాజు, ఎల్.సాయన్న, రాజ్ కుమార్, డీజే దయానంద్, ఎర్ర భూమయ్య, ఎల్టీ కుమార్, నరహరి, మ్యాకల దినేష్, లతీఫ్ తదితరులు పాల్గొన్నారు.